Breaking

Monday, January 18, 2021

ఆనాటి విద్య - ఈనాటి విద్య


   
           
                ఈ సృష్టిలో ఎవరి ధర్మాలు వారు పాటిస్తున్నారు. మరి రోజులు ఎందుకు ఇలా మారుతున్నాయి? అంటే దేని గురించి అనుకుంటున్నారా! అందరికీ ఉపయోగపడే విద్య గురించి మాట్లాడుతున్నాను. విద్యకు ఏమైంది అనుకుంటున్నారా! నిజమే విద్యకు ఏమయిందో ఎవరికి అర్థం కావటం లేదు కదా! విద్య అంటే చదువు, జ్ఞానార్జన అని అర్థం. ఒకప్పుడు మనదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. మరి ఇప్పుడు విద్య నేర్చిన నిరక్షరాస్యులు ఎక్కువ. ఇందులో భావం అర్ధమయిందా? 
                ఒక మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేగలిగేది ఒక విద్య మాత్రమే. అంత గొప్ప స్థానంలో నిలబెట్టగల విద్య ఇప్పుడు డబ్బుకు దాసోహం అవుతుంది. అంటే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు పెరుగుతున్నందుకు సంతోషపడాలి. కానీ అంత పెరిగినా విద్యలో నాణ్యత ఎందుకు రావడం లేదు. ఇక్కడ దోషం ఎవరిది? పాఠశాలలదా? గురువులదా? లేక తల్లిదండ్రులదా? అది కూడా కాదంటే సమాజానిదా?. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. 
                        ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి తెలుగు, ఇంగ్లీషు, హిందీ వంటి భాషలను మనకన్నా చాలా చక్కగా మాట్లాడుతున్న వారున్నారు.  మరి వారందరూ టాలెంట్ లేని వారా? ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే :- ఈ రోజుల్లో  పిల్లలు కేవలం పుస్తకంలో ఉన్న విషయాన్ని మాత్రమే నేర్చుకుంటున్నారు. ఇది రాబోయే కాలానికి కంటికి కనిపించని ప్రమాద హెచ్చరిక. ఎందుకంటే బట్టీకొట్టి చదవడానికే అయితే మన పూర్వీకులు ఇన్ని శాస్త్రాలు, ఇన్ని గ్రంథాలు రచించవలసిన పనిలేదు. అందరికి మనదేశ సంప్రదాయాలు, ఆచారాలు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. 
                         విద్యకు సరైన నిర్వచనం చెప్పినది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో ఈ రోజుల్లో అతి తక్కువ మంది మాత్రమే జ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నారు. 

 " అస్త్రం వా శస్త్రం, వస్త్రం, శాస్త్రం వినా వ్యర్థమిదం మానవ జన్మ".  ఇక్కడ మొదట చెప్పవలసినది. 

1. వస్త్రం:- బట్టలతో మానవుడు తన శరీరాన్ని దాచి ఉంచుకోవాలి.
2. శాస్త్రం:- 
             జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం, పూర్వం మానవుడు యజ్ఞయాగాదుల ద్వారా పుణ్యకార్యాలు చేయడానికి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కష్టాలను ఎదుర్కొని సుఖాన్ని పొందటానికి శాస్త్రాన్ని (విద్యను) ఉపయోగించేవారు. 
                 ఇక్కడ శాస్త్రం అంటే గ్రంథాలలో ఉన్నవి చదివి నేర్చుకోవడం అనే కాకుండా,అప్పట్లో ప్రజలు పెద్దగా చదువుకోకపోయినా తమ పూర్వీకుల ద్వారా ఆయుర్వేదం, సంగీతం, నాట్యం వంటి విషయాలు నేర్చుకుని తరువాతి తరాలకు అందించారు.
3. అస్త్రం వా శస్త్రం :- 
        అస్త్రం అంటే ఆయుధం, బాణం. రెండు చేతులతో ఉపయోగించేది అని అర్థం. మంత్ర తంత్రాలతో ఉపయోగించేటటువంటి బాణాలు కూడా. 
ఉదా:- నాగాస్త్రం, పాశుపతాస్త్ర్రం, మొదలైనవి.

"వా" అంటే లేదా అని అర్థం.

శస్త్రం :- శస్త్రం అంటే కత్తి, ఒంటి చేత్తో ఉపయోగించేటటువంటివి అని అర్థం. 
          అస్త్రం, శస్త్రం ఇవి రెండు వారి ప్రాణాలను రక్షించుకుంటూ, ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడేవి. పూర్వపు రోజులలో సాధారణ ప్రజలు కూడా కత్తులు, బడిసెలు వంటివి ఎక్కువగా ఉపయోగించేవారు.
            
వినా: లేకుండా
ఇదం :
మానవజన్మ వ్యర్థం : మానవజన్మ వృధా

మరి ఈనాటి విద్య ఎలా ఉందో తెలుసా!
1.  మన స్థాయిని తెలియజేయడం కోసం వస్త్రధారణ.

2. సగంమంది విద్యార్థులు మంచి మార్కులు సంపాదించినా బట్టి చదువులతో ఉద్యోగాలు సంపాదించలేని వారు కొందరు. చదువు తప్ప ఏమీ తెలుసుకోలేని మిగతా సగం విద్యార్థులు మార్కులు రాక, ఉద్యోగాలు సంపాదించుకోలేక, వ్యవసాయం చేయలేక, రాబోయే తరాలకు ఏమి నేర్పిస్తారో వేచి చూడాల్సిందే.

3. పదునైనటువంటి మాటలను అస్త్రాలుగా భావించి భయపెట్టి,  మోసం చేసి ధనం సంపాదించే వారు ఎక్కువగా ఉన్నారు. దీని అర్థం మోసాలు చేస్తూ చెడు దారిపడుతున్నారు. 

4. శస్త్రము అంటే ఇప్పుడు దొంగతనాలుగా మారిపోయాయి. కత్తులను ఉపయోగించి జనాల మానప్రాణాలను  దోచుకుంటున్నారు.
 అంటే ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? ఇది ఆలోచించవలసిన విషయం. 
                  ఈ కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ పిల్లలను పెద్ద పెద్ద పాఠశాలల్లో, కళాశాలల్లో చదివిస్తున్నారు కానీ పిల్లవాడి పరిస్థితిని మార్కులు వచ్చిన రోజు తప్ప మిగతా మరి ఎప్పుడు పరిశీలించలేని పరిస్థితి. 
                    మనం పిల్లలను మంచి దారిలో పెట్టాలన్నా అతి చిన్న వయసులోనే సాధ్యపడుతుంది కాబట్టి చిన్న పిల్లలకు నీతి కథలు బోధిస్తూ, పండుగ  సంప్రదాయాలను వివరిస్తూ, ఆచార వ్యవహారాలను నేర్పిస్తే భావితరాలకు తరగని సంపదగా మిగులుతుంది.
           ఎన్నో సంవత్సరాల నుంచి చెబుతూ ఉన్నారు నేటి బాలలే రేపటి పౌరులు అని మరి ఆ పౌరులను అత్యున్నత స్థానంలో నిలబెట్టగలిగినది ఒక విద్య మాత్రమే కాబట్టి ఆ విద్యను బట్టి చదువులతో కాకుండా, అర్థం చేసుకొని చదివి మన దేశ విద్యా వ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెట్టాలి అనేది ముఖ్య విషయం. 
               ఏ దేశంలో చూసిన అత్యున్నతమైన పదవులు పొందినవారిలో మన భారతీయులు కూడా ఉండటం మన దేశానికి గర్వకారణం. విద్యా వ్యవస్థలో బట్టి చదువులను మార్చడానికి ముఖ్యకారకులు 1.తల్లిదండ్రులు 2.గురువులు.  
                చదువు ఒక్కటే కాకుండా చదువుతోపాటు బొమ్మలు వేయడం, క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం, చదువుతోపాటు ఏదో ఒకటి వారికి నేర్పించాలనేదే నా ఉద్దేశం.

                 ఇక్కడ ఉన్న ప్రతి పదం నా ఆలోచనతో రాసింది. ఏ గ్రంథంలో లేదు కానీ నిజమే కదా!


స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః ।
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే ।।

భావం :- మూర్ఖుడు తన ఇంట్లో, ప్రభువు (అధికారి) తన గ్రామంలో, రాజు తన దేశంలో పూజింపబడతారు. కానీ విద్యావంతుడు అన్ని చోట్లా పూజింపబడుతాడు.




 
 
        

1 comment:

Babjan said...

📚📚👏👌