Breaking

Saturday, January 11, 2025

వ్యాస మహర్షి

వ్యాస మహర్షి

                                                          చేది రాజ్యపు రాజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు కాళిందీ నది ఒడ్డున సంభోగంలో ఉన్న జంతువులను చూసి తను ఇంద్రియనిగ్రహాన్ని కోల్పోయాడు. అతని రేతస్సును శాపవసాన నదిలో చేపరూపాన ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సుని పొంది గర్భాన్ని ధరించి కదలలేక ఉన్న సమయంలో బేస్తవాని యొక్క వలకు చిక్కుతుంది. బేస్తవాడు ఆ చేపని ఇంటికి వెళ్లి కోయగా లోపల కవలలను చూసి అందులో మగపిల్లవాన్ని రాజుకు ఇచ్చేస్తాడు. ఆడపిల్లకి కాళి అని పేరు పెట్టి తనే పెంచుకుంటాడు.

                                                        ఒకసారి పరాశరుడు కాళింది నది ఒడ్డున అవతలికి వెళ్ళడానికి పడవ కోసం చూస్తుండగా బేస్తవాడు అన్నం తింటూ ఉండటం వలన తన కుమార్తె కాళీకి చెప్తాడు. పడవలో వెళ్తుండగా ఒకవైపు ఎగిసి పడే అలలు, ఎగిరి పడే చేపలు మరోవైపు సన్ననైన నడుముతో నీటి కెరటాలతో తడిసిన బట్టలతో పడవ నడిపే కాళీని చూసి పరాశరుడు చిత్తచాపల్యుడు అయ్యెను.

                                                         కామోద్రేకంతో ఆమెను సమీపించగా మునిపుంగవుని కోరికను పసిగట్టి కాళీ దూరంగా జరిగినా పరాశరుడు వినలేదు. అంతేకాక పడవ చుట్టు పొగమంచుని సృష్టించి కాళీ శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేలా చేసి నది మధ్యలో ఒక దీవిని సృష్టించడు. ఇద్దరూ అక్కడికెళ్ళి అమరసుఖాలు పొందారు. ఆతర్వాత కాళీ గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికేమీ దూషణ ఉండదు. పైగా పుట్టబోయె పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు అయ్యి ముల్లోకాల్లో కీర్తించపడి జగద్గురువు అవుతాడు. ఇప్పుడు నీ ఒంటి నుండి వచ్చె పరిమళం శాశ్వతమై నువ్వు యోజనగ్రంధిగా పేరుగాంచెదవు అని దీవించెను.

                                                           మహర్షి చెప్పినట్లుగానే కాళీ పండంటి బిడ్డకు జన్మనిచ్చెను. అతను చిన్నతనం నుంచే దైవభక్తి, పెద్దలయందు వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక తల్లితో నా గురించి విచారించకు, తపస్సు చేసుకొనేెందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా కష్టం కలిగినా, నన్ను చూడాలనిపించినా నన్ను తలుచుకో నేను నీ ముందుంటాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణ. అయితెే పుట్టగానే ద్వీపంలో వదిలివేయబడ్డాడు గనుక కృష్ణద్వైపాయనుడు అని, వేదాలను విభజించిన కారణంగా వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు.

                                                     కాళీనే బెస్తపిల్ల అని, మత్స్యగ్రంధి అని, సత్యవతి అను పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సత్యవతి చంద్రవంశ రాజైన శంతన మహారాజుని పెళ్ళిచేసుకుంది. వీరికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను కుమారులు జన్మించారు. వీరిద్దరూ మరణించిన తర్వాత భీష్ముని మాటని అనుసరించి విచిత్రవీర్యుని భార్యలైన అంబిక, అంబాలికకు వేదవ్యాస మహర్షియొక్క అనుగ్రహంతో వారిరువురికి సంతానం కలిగేలా చేస్తుంది. వారే ధృతరాష్టుడు, పాండురాజు జన్మించారు. ఇరువురు రాజ్యపరిపలనకు అర్హులు కాదని తెలిసి సత్యవతి వ్యాసున్ని కోరగా చివరిసారిగా అంటే మూడవ అవకాశంగా అంబాలికను వ్యాసుని వద్దకు పంపగా  అది ఇష్టంలేక అంబాలిక తన దగ్గర ఉన్న దాసిని పంపగా దాసికి విదురుడు జన్మించాడు. ఈవిధంగా వ్యాసుడు తన తల్లి కోరికను తీర్చాడు. అంతేకాక కురుపాండవులకు కూడా రాజ్యపరిపాలనాసంబంధమైన విషయాలలో సలహాలిచ్చిన వారు వ్యాసుడు. అయితే హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే ఎక్కువ.



                                                             కురుపాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన గ్రంథస్తం చేసి లోకంలో చదివించాలని భావించి బ్రహ్మను కోరగా విఘ్నేశ్వరుడిని ధ్యానించమని చెప్పెను. ఆ తర్వాత వినాయకుడు అంగీకరించినా ఒక షరతు పెడతాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు లేఖినా ఒక్క క్షణమైన ఆగకూడదు. ఆ విధంగా చెప్పగలవా? అని ప్రశ్నిస్తాడు. దానికి వ్యాసుడు దేవా! నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకొని రాయాలి అందుకు తమరు సిద్ధమేనా అని ప్రశ్నిస్తాడు. వినాయకుడు కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరే అని చెప్పడంతో మహాభారతాన్ని రచించడానికి పునాది పడింది. మొట్టమొదట మహాభారతాన్ని వ్యాసుడు శుకుడికి చెప్పెను. తర్వాత దేవతలందరికి నారదుడు, గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు, మానవలోకానికి వ్యాసమహర్షి ముఖ్యశిష్యుడు వైశంపాయనుడు తెలిపెను.

                                                                

No comments: