సంచలనం ఐదవ వారం కథ చదవాలంటే ఈ క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి.
అనిల్ ఆ రాత్రి చీకట్లో మంచుకు వణుకుతూ తన పై అధికారిని కలిసి సెలవు అడిగితే నీ సెలవులు అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఏమిటి? అని ప్రశ్నించగా నా మిత్రుడు ప్రమాదం కారణంగా అత్యవసర చికిత్స పొందుతున్నాడు పిల్లలు కూడా చిన్న వాళ్ళు. నేను తప్ప ఎవరూ లేరు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అని చెప్పగానే అధికారి కాదనకుండా ఓకే చెప్పడంతో క్షణం కూడా ఆగకుండా రాత్రికి రాత్రి ఊరికి బయలుదేరుతూ ముందుగా తల్లికి ఫోన్ చేయగా విజయా మరణిించిందని, నారాయణ పరిస్థితి కూడా కష్టమే అని చెబుతుంది. అమావాస్య రోజు ఆటుపోట్ల సమయంలో వచ్చే రాక్షస అలల శబ్దం వినలేక చెవులు మూసుకున్నట్లుగా దేవుని స్మరించడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఊరికి బయలుదేరాడు.
నారాయణ పిల్లలను చూడాలంటే, హాస్పిటల్లో ఉన్న ఊరి పెద్దలు ఫోన్ చేయగా అనిల్ తల్లి, నారాయణ పిల్లలతో హాస్పిటల్ కి చేరుకుంటుంది. నారాయణ అనిల్ తల్లికి, పిల్లలను అప్పచెప్పి మీరే వీరి బాధ్యత తీసుకోవాలని, నేను ఏమీ చేయలేని స్థితిలో మీకు అప్పచెబుతున్నాను అని, పిల్లలకు మంచిచెడులను వివరిస్తూ కన్నుమూస్తాడు. రాత్రంతా పిల్లలు భవిష్యత్ తెలియక నదులు పొంగి ప్రవహిస్తున్నట్లుగా ఏడుస్తూనే ఉంటారు. ఊరి పెద్దలే దగ్గరుండి వారి గ్రామానికి తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలకి సిద్దం చేస్తారు.
మధ్యాహ్నానికి అనిల్ వస్తూనే అనిల్ తల్లి యేరులై పారుతున్న కన్నీటిని ఆపుకోలేక ఏడుస్తూ నారాయణ చెప్పిన మాటలను వివరిస్తూ తాను కూడా గుండెపోటుతో అనిల్ ఒడిలోనే మరణిస్తుంది. మిత్రుని వియోగమే తట్టుకోలేకపోయిన అనిల్ కి తల్లి మరణం మరో ప్రపంచ యుద్దాన్ని చేస్తున్నట్లుగా ఉంది. కానీ ఊరిలో వారందరూ రక్తం పంచి కనకపోయినా ప్రేమాభిమానాలు పంచి పెంచుకున్న కొడుకు కోడళ్ళ మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అందుకే తను కూడా ప్రాణాలు విడిచిందని చెప్పుకోవడం విని ఇంత కన్నా గొప్ప బంధాన్ని ఎక్కడా చూడలేదని అనుకుంటూ ఊరి ప్రజలందరూ మంచి వ్యక్తిని కోల్పోయామని అమరహే అని నినాదాలు చేస్తూ స్నేహానికిి, ప్రేమకి, అనురాగానికి మారుపేరుగా నిలిచిన వీరికి ఐదు నిమిషాలు మౌనం పాటించి దహన సంస్కారాలను పూర్తి చేస్తారు.
శరత్ తో మరొకసారి మాట్లాడి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని బంధువులు అందరూ రాత్రి భోజనానికి శరత్ వచ్చే వరకు వేచి ఉంటారు. శరత్, కీర్తీలను వారి వ్యాపారంలో భాగస్వామ్యం విషయం మరోసారి అడగగా వారి నుంచి యథావిధిగా సమాధానం రావడంతో చేసేదేమీ లేక సిమెంట్ ఫ్యాక్టరీకి కట్టాల్సిన మొత్తం డబ్బు రేపు కట్టకపోతే రెండు రోజుల్లో నోటీసులు పంపుతామని చెబుతారు. అప్పటి వరకు ఎప్పుడూ అందరి ముందు మాట్లాడని కీర్తీ అవకాశం దొరికిందని చంద్రుని వెన్నెలను మబ్బులు దాచినట్లుగా మనస్సులోని కోపాన్ని చిరునవ్వు వెనుక దాచి రెండు రోజుల్లో మీ డబ్బులు కట్టి, వారం రోజుల్లో వేరే ఇంట్లోకి మారుతున్నామని తెలియచేస్తుంది.
కీర్తీ మాట్లాడక ముందు వరకు బంధువులు అందరూ కూడా కీర్తీ అమాయకురాలు వ్యాపార లావాదేవీలు ఏమీ తెలియవు అనుకున్నారు. మొట్టమొదటి సారిగా భర్తని చేతి సైగలతో ఆపి, మాట్లాడాక మాటల్లో గంభీరత్వాన్ని విని గాలికి ఎగిరిన ఎంగిలి ఇస్తరాకులా ఎవరి పాటికి వారు తిని మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు కూడా కీర్తీ నవ్వుతూ మాట్లాడిన రెండే రెండు వాక్యాలలో సునామీని సృష్టించింది అని కీర్తిని, వాళ్ళ పెంపకాన్ని (ఎక్కడ మాట్లాడాలి? ఎంత వరకు మాట్లాడాలి? ఏమి మాట్లాడాలి) ఒకరికొకరు మెచ్చుకున్నారు.
ఎవరి గదికి వారు వెళ్ళిపోయాక తల్లిదండ్రులు వారి గదికి వచ్చి ఎంత కట్టాలి అని అడగగా, శరత్ 37 లక్షలు కట్టాలి కానీ అగ్రిమెంట్ ప్రకారం నెల సమయం ఉందని భాగస్వామ్యం ఇవ్వక పోవడం వల్ల ఈ విధంగా అడుగుతున్నారు అని వివరిస్తాడు. కీర్తీ తల్లిదండ్రులు వారు దాచుకున్న కొంత ధనాన్ని తెచ్చి ఇచ్చి ఫ్యాక్టరీకి చెల్లించమని చెబుతారు. తీసుకోవటం ఇష్టం లేక పోయినా తప్పని పరిస్థితుల్లో తీసుకుంటాడు.
లక్ష్మీ కోరిక మేరకు ఊరిలో వారందరిని పిలిచి రెండు రోజుల్లో భోజనాలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. హరికి పని ఉందని స్కూల్ కి సెలవు పెట్టి భోజనాలకు ఎంతమంది లెక్కలు వేస్తూ ఉన్నాడు. ఉదయం 10 గంటలకు శరత్, చరణ్ ద్వారా హరికి ఫోన్ చేసి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందాం అని చెప్తారు. దానికి ఒక వారం సమయం ఇమ్మని హరి అడిగి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ ఫోన్ ఈ సారి శరత్ వంతు ఒకసారి మీమ్మలను కలిసి మాట్లాడాలి మీరు ఆఫీసుకు రండి త్వరగా అని చెప్తాడు. హరికి ఏమి చేయాలో దిక్కు తోచక సర్పంచ్ ని తీసుకొని బయలుదేరుతారు.
విజయ నారాయణలు పిల్లల పరిస్థితి ఏమిటి? అనిల్ వారి విషయంలో ఏమి ఆలోచిస్తాడు? శరత్ 37 లక్షలు కట్టాలంటే హరి ఫ్లాట్ కొనాలి. అప్పటికప్పుడు అంటే హరి అంగీకరిస్తాడా? ఈ విషయాలను వచ్చే శనివారం మీ మనకథలు లో చదవండి.
1. ఈ మెసేజ్ ను కింద కనపడుతున్న వాట్స్అప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
2. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
No comments:
Post a Comment