Breaking

Sunday, September 29, 2024

బ్రోకర్

                    


 పూర్వము శ్రీకృష్ణుడు అంతటి వాడే పాండవులకు రాయబారిగా వెళ్ళి కౌరవుల చేతిలో అవమానింపబడ్డాడు. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే రాయబారిని బ్రోకర్ అని, మధ్యవర్తి అని లేక ఇంకేమైనా పేర్లతో పిలిచి అవమానిస్తూ ఉంటాము. కానీ అటువంటి రాయబారే లేకపోతే మన జీవితంలో సగం పనులను పూర్తి చేయలేము ఇది నిజమే కదా! కానీ ఇక్కడ మీకు చెప్పవల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైన విషయం నేటి యువత అన్ని విషయాలలో ప్రక్కనే ఉన్న మిత్రులను నమ్మరు కానీ మధ్యవర్తులను (రాయబారులను) నమ్మి మోసపోతున్నారు అనడంలో సందేహం లేదు.  దీనికి ప్రధాన కారణం---

                         యువతకు చేసే పని మీద సరైన అవగాహన లేకపోవడం, త్వరగా పని పూర్తవ్వాలని కోరుకోవడం వీటివలన మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోతున్నారు. ఎలాగంటే-----

                        ఒక ఊరిలో శివ అనే ఒక యువకుడు బాగా ధనవంతుడు ఉండేవాడు. అతనికి రాజు అనే మిత్రుడు ఉన్నాడు. ఇద్దరూ మంచి మిత్రులు. అయితే శివ  బిటెక్ చదువుకోవడానికి, జీవితాన్ని బాగా ఎంజాయ్ చెయ్యడానికి సరైన ప్రదేశం బెంగుళూరు అని నిర్ణయించుకొని బెంగుళూరులో ఒక మంచి కాలేజిలో చేరాడు. అక్కడున్న మిత్రులందరిని చూసి పులిని చూసి నక్క ఒళ్ళంతా వాత పెట్టుకున్నట్లు  తనకన్నా మిగతా వారందరికి మంచి బైకులు, మంచి ప్రెండ్స్ ఉన్నారని నిజంగా అటువంటి మిత్రులను పొందడం అదృష్టమని భావించాడు. ధనవంతుడే అయినప్పటికి మిగతా వారందరిలాగా ఇంకా బాగా ధనికుడిగా కనపడాలని తండ్రిని బాగా ఇబ్బంది పెట్టి మాంచి బైకు కొని బాగా తిరుగుతూ, లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి, తరగతులకు డుమ్మా కొడుతూ కొత్త పరిచయాల వలన పాత మిత్రులను మరవడం, సెలవలకు ఇంటికి వెళ్ళకుండా తల్లిదండ్రులను కూడా  మరిచిపోయాడు. అయితే కొన్నాళ్లకి ఇంటిదగ్గరి నుండి తండ్రి డబ్బులు పంపక పోవడంతో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలలకు అప్పు ఇచ్చిన వారందరూ అడగటంతో వారి దగ్గర వారం రోజుల సమయం తీసుకొని సొంత ఊరికి బయలుదేరాడు. తల్లిదండ్రుల మీద కోపంతో అప్పుల గురించి ఆలోచిస్తూ బండి వేగంగా నడిపే ప్రయత్నంలో అకస్మాత్తుగా అడ్డుగా వచ్చిన కుక్కను చూసి బ్రేకు వేయడంతో అదృష్టవశాత్తు మరణం తప్పి, తీవ్రమైన దెబ్బలతో ఆసుపత్రిలో చేరుతాడు.

                        ఆ విషయం తెలిసి తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో కోపతాపాలను ప్రక్కన పెట్టి, చిన్నప్పటి నుంచి ఏదడిగినా కాదనకపోవడం, గారాబంతో పెంచడం వలన నాకు సరైనదే జరిగిందని కొడుకుని వదులుకోలేక  తన బావమరిదిని తీసుకొని బయలుదేరుతాడు. అయితే వైద్యులు శివకి కాలు ఎముక విరిగింది కాబట్టి ఆపరేషన్ చేసి రాడ్ వేసామని మూడు నెలలు విశ్రాంతి అవసరమని  చెప్తారు. ఇంటికి వెళ్ళాక ఒక పది రోజులు గడిచాక తన పరిస్థితి మేనమామకి చెప్పి తండ్రి దగ్గర డబ్బులు ఇప్పించమని అడగటంతో మేనమామ శివ తండ్రితో మాట్లాడతాడు. బావమరిది మాటలకు ఆకర్షితుడవ్వటం, వయస్సుమీద పడటంతో ఇక నేను చివరిగా  నా కొడుక్కి చేసే సాయమని పొలము అమ్మి అప్పులన్ని కట్టమని డబ్బులిస్తాడు.  అయితే తండ్రి మాటలకు బాధ పడినప్పటికి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలకు, ఎవరో బ్రోకర్ ఫోన్లో చెప్పిన మాటలు అగ్నికి  ఆజ్యం పోసినట్లు శివ ఆలోచనలకు కొత్త రెక్కలు వచ్చినట్లు కొంత డబ్బు తన దగ్గర ఉంచుకొని ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలని భావిస్తాడు. దానికి కారణం షేరు మార్కెట్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని నమ్మాడు.

                        అయితే పండుగకు ఇంటికి వచ్చిన రాజుకి శివ యాక్సిడెంట్ విషయం తెలిసి దాదాపుగా అయిదు సంవత్సరాల తర్వాత శివని కలుస్తాడు.  రాజు ఉన్నంతసేపు శివ మాట్లడటం కన్నా ఎక్కవ సమయం మొబైల్  చూస్తుండటంతో శివ చేసే వ్యాపార విషయాన్ని తెలుసుకొని రాజు వద్దని దాని మీద అవగాహన లేకుండా బ్రోకర్ మాటలు విని చేయడం శ్రేయస్కరం కాదని శివకి వివరించినాగానీ వినకుండా చేస్తాడు. శివ ఇరవై రోజుల్లో లక్షకు దాదాపుగా రెండు లక్షలు సంపాదించే సరికి బాగా దైర్యం వస్తుంది దానితోపాటు ఆశ కూడా పెరిగి అమ్మిన పొలాన్ని తిరిగి వెళ్ళేలోపు కొనాలన్న ఆశ. అయితే మామతో కొత్తగా వ్యాపారం చెయ్యటానికి తనకి ఇప్పుడు అయిదు లక్షల డబ్బు వడ్డికైనా ఇవ్వమని రెండు నెలల్లో ఇస్తానని చెప్తాడు. దానికి మామ కూతురు పెళ్లికోసం దాచాను. నువ్వు వడ్డీ ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ అసలు ఇవ్వకపోతే ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పి శివకి అడిగిన డబ్బు ఇస్తాడు. అలాగే రాజుని అడిగి కొంత డబ్బు తీసుకుంటాడు అయితే శివకి చేతిలో డబ్బులు పడగానే ఇక ఆశ కాస్త అత్యాశగా మారింది.

                                కొత్తగా పెళ్ళైనవాడు పొద్దెరగడు అన్నట్లు ఇక అర్ధరాత్రికే ఎప్పుడు తెల్లారుతుందా? అని ఎదురుచూపులు చూస్తు మొదట్లో వచ్చినట్లుగా డబ్బులు ప్రతి రోజూ వస్తాయని భావించి పగటి కలలు కంటూ ఉండగానే రెండు నెలల కాలంలో డబ్బుకు డబ్బు పోయింది ఎలా తిరిగి ఇవ్వాలో తేలియక సతమతమవుతూ ఉంటాడు. మేనమామ కూతురు పెళ్ళి కుదిరిందని డబ్బులు అడిగితే జరిగిన విషయం చెప్తాడు. వేరే గత్యంతరం లేక మరదలను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఊరిలో ఉంటే ఉద్యోగం దొరికిందని భార్యని తల్లిదండ్రుల దగ్గరే వదిలి మళ్ళీ బెంగుళూరు వెళ్తాడు. ఇక కుటుంబాన్ని పోషించుకోవటానికి ఉద్యోగం కోసం వేట మొదలు పెడతాడు. 

                                    రోజులు గడిచే కొద్ది ఉద్యోగం లేక ఆలోచనలు పెరిగి వ్యసనాలకు బానిస‌అవుతాడు. అయితే రాజుకి డబ్బు అవసరమయ్యి శివకి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. రాజు ఊరికి వచ్చిన తర్వాత జరిగిన విషయాలను తెలుసుకున్న రాజు  బెంగుళూరు వెళ్ళి  శివని కలిసి మార్చడానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసి, తిరిగి ఆవిధంగా సంతోషంగా గడపాలన్న నీ గౌరవం పెరగాలన్న నాతో రమ్మని తీసుకొని వెళ్ళి  తన కంపెనీలోనే ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. రాజు శివ ప్రక్కనే ఉంటూ వ్యసనాల నుంచి  తప్పించి జీవితంలో స్థిరపడేలా చేస్తాడు.  

               ఇక్కడ బ్రోకర్ వల్ల చెడినవారు ఉన్నారు. బాగుపడినవారు కూడా ఉన్నారు. కానీ షేర్ మార్కెట్ అనే వ్యాపారం గురించి ఎవరి మాటలు బడితే వారి మాటలు విని తెలియక చాలా మంది యువకులు నష్టపోతున్నారని నా అభిప్రాయం మాత్రమే. ఇక్కడ చిన్ననాటి స్నేహం స్వచ్ఛమైనది.


1 comment: