Breaking

Wednesday, November 4, 2020

శత్రువు అంటే ఎవరు? ఎలా జయించాలి?

             

            


                        ప్రతి మనిషికి శత్రువు ఉంటాడు. శత్రువు లేని మనిషి లేడు. మనిషి లేనిదే శత్రువు లేడు. మనిషికి మనిషే శత్రువు. "ఎంత గొప్ప మనిషి అయినా ఎవరో ఒకరి జీవితానికి శత్రువు అయ్యి ఉంటాడు". ఎవరి జీవితానికి వారి నాయకుడు అంటారు. కానీ ఎవరి జీవితానికి వారే శత్రువు కూడా. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏ కార్యాన్ని తలపెట్టినా మొదట సమాధానం ఇచ్చేది అంతరాత్మే. దానికే భయం, ధైర్యం అని పేర్లు.

          కార్యం విజయవంతం అయితే ధైర్యంగా సాధించావు అంటాం. మరి ఓటమి రుచి చూస్తే భయంతో ఓడిపోయావు అంటాం. అంటే మనకి మనమే శత్రువులము. మొదట మన శత్రువుని మనం జయించాలి. ఇంతకీ ఆ శత్రువు ఎవరో తెలుసా "భయం". భయాన్ని జయించలేని వాడు విజయం సాధించలేడు. ప్రతి ఓటమికి మొదటి శత్రువు భయం, రెండవ శత్రువు సోమరితనం. ఎందుకంటే ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు భయాన్ని జయించి అంటే ధైర్యంగా, సిగ్గు పడకుండా మనం ఎంచుకున్న కార్యాన్ని మంచి-చెడు, లాభనష్టాలు రెండు తెలుసుకున్నప్పుడే కార్యసాధనకు మొదటి అడుగు పడుతుంది లేదంటే ఏమవుతుందో? మీకు తెలుసు.

         మనిషి భయాన్ని జయించినా ఓటమి పాలయ్యాడు    అంటే అందులోనూ రెండు కారణాలు ఉంటాయి. 

1. మనం ఏ పని ప్రారంభించినా పక్కన ఉన్న ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మన ఆలోచనలను మధ్యలోనే ఆపేలా చేస్తాయి. నిరుత్సాహంతో ఆ  పని ఆపేస్తాం.

2. కొందరి ప్రోత్సాహంతో ముందుకు నడిచిన మన మీద మనకు నమ్మకం లేక ఓటమిపాలవుతాం.

                 శ్రీను డిగ్రీ పూర్తిచేసి హైదరాబాదులో ఉద్యోగం చేసి చేసి విసుగుతో పండుగకి ఇంటికి వచ్చి అందర్నీ ఒప్పించి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. కానీ తల్లిదండ్రులకు శ్రీను మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎప్పుడూ ఒక రూపాయి కూడా ఇంటికి పంపకపోవడంతో పాటు ఇంటికి వచ్చినప్పుడల్లా డబ్బులు తీసుకు వెళ్తుండటంతో శీను తల్లిదండ్రులు వ్యాపారానికి అంగీకరించలేదు. మిత్రుడు రవికి ఇంట్లో కష్టసుఖాల గురించి, హైదరాబాదులో పడుతున్న బాధలను వివరిస్తూ బైక్ మీద పట్టణానికి వెళ్తూ ఉండగా దారిలో బైక్ పంచర్ కావడంతో, బస్సుకు సమయం అయిందని ఆటో ఎక్కి బయలుదేరుతాడు.

         రాజు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెళ్లయిన తరువాత మొదటి పండుగకి అత్తగారింటికి వెళ్లి పండుగ రోజులను అత్తగారింట్లో సంతోషంగా గడిపి సెలవులు పూర్తవడంతో తన భార్య రాణి ని తీసుకుని రాత్రి కారులో బెంగళూరు బయల్దేరాడు. అనుకోకుండా చీకట్లో ఎదురుగా వచ్చినటువంటి  జంతువును తప్పించబోయి ప్రమాదానికి గురవుతారు.  ప్రమాదానికి గురైన కారు ని చూసి ఆటోని ఆపి సహాయం చేయమని ప్రార్థిస్తాడు శ్రీను. కానీ ఆటో వాడు ఇవన్నీ సర్వసాధారణమని, వారిని రక్షించడానికి వెళ్తే కేసులని నేను పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాలి కాబట్టి నేను రాను అని చెప్పి శ్రీనుని దించి వెళ్ళిపోతాడు.

           కార్లో ఉన్న రాజు,రాణిలను ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకుని వెళ్లే దారిలో పదే పదే వారిని కదిలిస్తూ, సృహ కోల్పోకుండా ఉండాలి అనే తపనతో రక్షించే ప్రయత్నంలో  తన బస్సు సంగతి కూడా గుర్తు రాదు. బస్సు సంగతి గుర్తొచ్చేసరికి అర్ధరాత్రి కావడంతో ఆ విషయాన్ని వదిలేస్తాడు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో ఉదయానికి కొంచెం ధైర్యంతో రాజు దగ్గరికి వెళ్లి కనపడినప్పుడు రాజు, శ్రీనుని కోలుకునేంతవరకు కూడా తమతోనే ఉండమని చెప్తాడు. దానికి కారణం 

1. సరైన సమయానికి శ్రీను రాకపోయి ఉంటే వారి పరిస్థితి ఏమిటి?

2. ఇద్దరూ క్షేమమని డాక్టర్లు చెప్పేంతవరకు తన మనసులో మెదిలిన ఆలోచనలు తనకు ఏమైనా అయితే తల్లి కాబోతున్న తన భార్యాపిల్లల పరిస్థితి ఏమిటి? 

                అలా రెండు రోజులు రవి చేత శ్రీను వారి ఇంటి దగ్గర నుంచి ఆహారాన్ని తెప్పించి వారిని జాగ్రత్తగా చూసుకుంటాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఊరికి వెళ్లేటువంటి సమయంలో శ్రీను గురించి పూర్తి వివరాలు తెలుసుకొని బయలుదేరుతాడు. ఒక నెల తరువాత రాజు శ్రీనుకి ఫోన్ చేసి శ్రీనుని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. శ్రీనుతో  తన ఉద్యోగం కూడా పోయింది కాబట్టి ఇద్దరం కలిసి  ఏదైనా వ్యాపారం కానీ, లేదా కొత్త సంస్థని కానీ ప్రారంభించుదామని డబ్బు మొత్తం నేనే పెడతానని రాజు తెలియజేస్తాడు. అయితే రాజు సాఫ్ట్వేర్, శ్రీను  యానిమేషన్ డిజైనర్ కాబట్టి ఇద్దరూ అడ్వర్టైజింగ్ కు సంబంధించిన కొత్త సంస్థను ప్రారంభిస్తారు.

                     అయితే శ్రీనుకి తల్లిదండ్రులు కూడా ఇవ్వని అవకాశాన్ని రాజు ఇచ్చినందుకు సంతోషంతో నమ్మకంగా  రాత్రింబవళ్లు ఇద్దరు పనిచేసి వ్యాపార రంగంలో మంచి ఉన్నతిని సంపాదించుకుంటారు. రాజు కొడుకు మొదటి పుట్టిన రోజున శ్రీనుకి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తాడు. అదేమంటే తన ఉద్యోగం పోలేదని, మా కుటుంబాన్ని రక్షించిన నీకు ఏదో ఒక విధంగా సహాయం  చేయాలనుకున్నాం. కానీ ఆ సహాయం నిన్ను జీవితంలో గొప్పవాడిగా చేసేదై ఉండాలని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. డబ్బులు ఇస్తే మా ప్రాణాలకు విలువ కట్టినట్టు ఉంటుంది లేదా నువ్వు ఖర్చు పెట్టుకుంటావు. దానివలన ఉపయోగం ఉండదని నీ ఎదుగుదల మరికొంత మందికి ఆదర్శం కావాలని ఇలా చేశాను అని తెలియజేస్తాడు.

           ఈ విషయమంతా శ్రీను తల్లిదండ్రుల ముందు చెప్పడంతో తండ్రి కొడుకు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని డిగ్రీలో  ఫెయిల్ అయ్యి, నా చేత తిట్లు తిన్నా ఈరోజు నా కొడుకు జీవితంలో గెలిచాడు అని సంతోషంతో మురిసిపోయాడు.

ఈ కథలో మీకు ఎవరికైనా భయము ధైర్యము కనపడ్డాయా? 

1. శ్రీను కి భయం లేదు కాబట్టే యాక్సిడెంట్ అయిన కుటుంబాన్ని రక్షించగలిగాడు.

2. మరి ఒకరి ధైర్యం మరో కుటుంబాన్ని రక్షించగలిగింది. ఆ ధైర్యమే ఈనాడు శ్రీను ని చదువులో ఫెయిల్ అయినా జీవితంలో గెలిచేలా చేశాయి. 

             భయపడిన వాడికి తప్పదు ఓటమి,  ప్రతి ఒక్కరూ మొదట మీలోని మీశత్రువుతో పోరాడిన వారికి ఎప్పటికీ విజయమే. కాబట్టి మీలోని శత్రువు అంటే భయాన్ని జయించండి.

నవంబర్ 14 నుండి వీక్లీ స్టోరీస్ అందించబడును. తప్పకుండా తిరిగి వీక్షిస్తారు అని ఆశిస్తున్నాను.


3 comments:

Anonymous said...

గురువుగారు అద్భుతమైన కథ .భయాన్ని జయించడానికి ఒక మంచి ప్రోత్సాహన్ని ఇచ్చే కథ.

Anji said...

Super sir

Anonymous said...

Avunu evariki vare enemy