Breaking

Wednesday, December 9, 2020

ఆరాటం ప్రతిక్షణం

                                   ప్రతి మనిషికి రోజూ చేసే పని బోర్ కొట్టి కొత్త పని ఏదైనా చేయాలనుకుంటాడు. దానితో కొత్తజీవితం ప్రారంభించాలని అనుకుంటాడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఏ పని చేసినా తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎందుకంటే ఇది కలియుగం. కలియుగంలో మానవుల ఆశలకి హద్దులు ఉండవు. "లేని వాటి కోసం ఆరాటపడి ఉన్నవాటిని పోగొట్టుకుంటారు" అని శ్రీకృష్ణుడు  కురుక్షేత్రం ముగిసిన తర్వాత పాండవులకు వివరించాడు.

                    విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యారు. సీనియర్  విద్యార్థులందరూ కొత్తగా వచ్చిన విద్యార్థులు అందరికీ స్వాగతోత్సవం (వెల్కమ్ పార్టీ)ని ఏర్పాటు చేశారు. అందరూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటారు తరువాత అధ్యాపకుల ప్రసంగం సమయంలో రామకృష్ణ అనేేేే ఒక అధ్యాపకుడు విద్యార్థులకు నేను మీకు ఒక కథ చెప్తాను. అందులో నీతిని గ్రహించమని  చెబుతాడు. 

           ఒకసారి రాజుగారి ఆస్థానానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. భటుడు రాజు దగ్గరికి వెళ్లి ఒక రైతు, ఎక్కడి నుంచో వచ్చిన జ్యోతిష్యుడు మరియు వేరే రాజ్యానికి చెందిన వైద్యుడు ఒకేసారి వచ్చారు. ముందుగా మీ దగ్గరకి ఎవరిని పంపించాలో తెలియక వచ్చాను  మహారాజా. దానికిి రాజు రైతుని పంపమని చెబుతాడు. రాజు రైతుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే  జ్యోతిష్యునికి, వైద్యునికి మనసు లో రాజు మీద కోపం వస్తుంది. జ్యోతిష్యుడు కోపాన్ని ఆపుకోలేక భటున్ని  తోసుకొని వెళ్లి నా విలువ తెలిసి కూడా మీరు మమ్మల్ని వేచి ఉండమని ఒక సర్వ సాధారణమైన రైతు తో మాట్లాడుతున్నారా! దానికి  వైద్యుడు  కూడా నన్ను పక్క రాజ్యం నుంచి పిలిపించి నా సమయం కూడా వృధా చేశారు అని కోప్పడతాడు.

            దానికి తెలివిగా మహారాజు వారిద్దరినీ పండితులారా మీరు వచ్చారని మా రక్షకుడు చెప్పాడు కానీ నేను మీకు ఒక పరీక్ష పెట్టాలి అని అనుకున్నాను. రైతు ముందు పరీక్ష పెడితే బాగుండదని రైతును పంపిన తర్వాత మీకు పరీక్ష ప్రారంభించాలని అనుకున్నానని చెప్పగానే ఇద్దరు నిజమే నేమో రైతు ముందు రాజు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే పరువు పోతుందని రాజు కూడా ఆలోచించాడు. ఆహా! మహారాజు ఎంత గొప్పోడు అని ఇద్దరు మౌనంగా ఉండిపోతారు.

                          సరే ఎలాగూ వచ్చారు కాబట్టి మీరిద్దరూ  వంటశాలలోకి వెళ్లి మీరే వండుకొని తృప్తిగా భోజనం చేసి వచ్చిన తరువాత నేను మీతో మాట్లాడుతాను అని చెప్పి వారిద్దరికీ వేరు వేరు గదులను చూపించమని రక్షకభటుని తోడుగా పంపుతాడు. వారిద్దరికీ గదులను చూపించి, స్నానం చేసి వచ్చేసరికి వంటకు కావలసిన సామాన్లు తెస్తానని భటుడు వెళ్ళిపోతాడు. జ్యోతిష్యునికి తలుపు తీయగానే నల్ల పిల్లి ఎదురు వస్తుంది. అపశకునం అని గడప బయట కూర్చుని ఉంటాడు. భటుడు వచ్చి పిల్లి ని బయటికిిి  పంపిన తరువాత లోపలకి వెళ్తాడు. వైద్యుడు గదిలోకి వెళ్లి సిద్ధమవుతూ ఉంటాడు ఇద్దరికీ వంట సామాన్లను భటుడు తెచ్చిస్తాడు. 

                         వైద్యుడు కూర చేయడానికి అక్కడ వంకాయ, గోంగూర, దోసకాయలు చూసి వంకాయ, గోంగూర రెండూ చర్మ సంబంధమైన రోగాలను కలుగజేస్తాయి. కాబట్టి దోసకాయలతో కూర చేస్తాడు. జ్యోతిష్యుడు వంట చేయడం ప్రారంభించే సరికి బల్లి అరవడం ప్రారంభిస్తుంది అది కూడా అపశకునమే. కాబట్టి వంట చెయ్యడం ఆపేస్తాడు. వైద్యుడు కూర వండినా తినలేని పరిస్థితి ఎందుకంటే దోసకాయలు చేదుగా ఉండటం వల్ల  కూర చెడిపోయింది. 

         రెండు గంటల తర్వాత మహారాజు వారిద్దరిని పిలిపించి పండితులారా తృప్తిగా భోజనం చేశారా! అని అడగగానే బయటకు చెప్పుకోలేక తిన్నామని తలకాయలు ఊపుతారు. తలకాయలు అబద్దం చెప్పినా కళ్ళు మాత్రం నిజం చెబుతాయి అన్నది రాజు సిద్ధాంతం. వారు తినలేదని తెలుసుకొని మహారాజు వారిద్దరిని ఈ భూమి మీద అతి కష్టమైన కార్యం ఏమిటి? అని ప్రశ్నిస్తాడు. జ్యోతిష్యుడు భవిష్యకాలం గురించి చెప్పడం అని సమాధానం చెప్తాడు. వైద్యుడు ప్రాణం పోయడం అని చెప్తాడు.

                    మహారాజు వారిద్దరు చెప్పిన సమాధానం తప్పు అని ఈ సృష్టిలో అతి కష్టమైన కార్యం ఎదుటి వ్యక్తిని గౌరవించడం అని సమాధానం ఇస్తాడు. మీరు చేసే పని మీకు గొప్పది కానీ ఒక్క పూట అన్నం వండుకోలేని మీ పాండిత్యం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. వైద్యుడు సహనాన్ని కలిగి ఉండాలి అది  నీకు లేదు. జ్యోతిష్యునితో నుదిటి మీది  రాతను మార్చడానికి ఎవరు సమర్థులు కారు. కాబట్టి ఈ రాజ్యానికి మీ ఇద్దరి అవసరం లేదు అని చెప్పి రైతు లేకపోతే ఈ సృష్టిలో ఏ మనిషికి ఆహారం దొరకదు. రైతు గొప్పతనం గురించి వివరించి వారిని పంపించేస్తాడు.

    ఈ కథలో వైద్యుడు ప్రక్క రాజ్యానికి చెందినవాడు  ఆ రాజు కన్నా ధనం ఎక్కువ ఇస్తాను అనగానే ఇక్కడికి వచ్చాడు. జ్యోతిష్యుడు రాజ్యంలో రానున్ననటువంటి కష్టసుఖాలను తెలియజేసి బహుమతులను పొందటానికి వచ్చాడు.  ఇద్దరూ స్వార్థపరులే. 

                ఈ కలికాలంలో విద్యార్థులు కూడా  పత్రాలలో వచ్చిన మార్కులు మాత్రమే గొప్పవి, మాకు  అన్నీ తెలుసు అని అనుకుని ఎదుటి వారిని గౌరవించడం మర్చిపోయారు. ఎదుటి వ్యక్తిని గౌరవించాలి అంటే మనలో "అహం" అడ్డం వస్తుంది. ఎప్పటికప్పుడు పని చివరి వరకు వాయిదా వేసుకుంటూ వచ్చి పరీక్షకు ముందు చదువుతూ మార్కులు రాగానే హీరోలుగా ఫీల్ అవుతుంటారు.  కలికాలంలో విద్యార్థులు పుస్తకాలను బట్టీ కొట్టడమో తప్ప జ్ఞానార్జన లేదు. కాబట్టే ధనార్జన కూడా లేదు.

2 comments:

Unknown said...

It's true, former is king.

Unknown said...

Manakatalu manandari kathalu baagunnnaay