రామాయణంలోని అయోధ్యకాండ 100 వ సర్గ
శ్రీరాముడు రాజనీతి ధర్మాలను బోధించుట:-
జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి।
దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా।। 1
భావం:- నారవస్త్రాలను ధరించి, జటాధారియై, భూమిపై సాగిలబడి నమస్కరించుచు, ప్రళయ కాలమున సూర్యుని వలె దీనావస్థలో ఉన్న భరతుని శ్రీరాముడు చూచెను.
కథంచిదభివిజ్ఞాయ వివర్ణవదనం కృశమ్।
భ్రాతరం భరతం రామః పరిజగ్రాహ బాహునా।। 2
ఆఘ్రాయ రామస్తం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవః।అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్ సమాహితః।। 3
భావం:- ముఖమున వన్నెదరిగి, కృశించియున్న సోదరుడగు భరతుని ఎట్టకేలకు గుర్తించి, శ్రీరాముడు అతనిని తన చేతులలోకి తీసుకొనెను. పిమ్మట రఘురాముడు భరతుని కౌగిలించుకొని, శిరస్సును నిమురుతూ తన ఒడిలోకి చేర్చుకుంటూ కుశలప్రశ్నలు గావించెను.
క్వను తేऽభూత్ పితా తాత!యదరణ్యం త్వమాగతః। న హి త్వం జీవితస్తస్య వనమాగంతుమర్హసి।। 4
భావం:- నాయనా! భరతా! తండ్రి గారెక్కడ? నీవు అక్కడ ఆయనకు సేవలు చేయక ఇట్లు ఈ అరణ్యమునకు ఏల వచ్చితవి?
చిరస్య బత పశ్యామి దూరాద్భరతమాగతమ్।దుష్ర్పతీకమరణ్యేऽస్మిన్ కిం తాత! వనమాగతః ।। 5
భావం:- అహో! మేనమామ ఇంటికి వెళ్ళిన తరువాత ఎంతో కాలమునకు ఇంతదూరము ఈ అడవికి విచ్చేసిన భరతుని నేడు చూస్తున్నాను. మిగుల బక్కచిక్కి ఉన్నాడు. నాయనా! భరతా! ఎందులకు ఈ వనములకు వచ్చితివి.
కచ్చిద్దారయతే తాత! రాజా యత్వమిహాऽగతః।
కచ్చిన్న దీనః సహసా రాజా లోకాంతరం గతః।। 6
భావం:- నాయనా! భరతా! మహారాజుగారు కుశలమే కదా! ఒకవేేళ మనతండ్రి పరలోకగతుడుకాలేదు కదా?
కచ్చిత్ సౌమ్య! న తే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతమ్। 7
కచ్చిత్ శుశ్రూషసే తాత పితరం సత్యవిక్రమమ్। 8
భావం:- ఓ సౌమ్యుడా! నీవు బాలుడవగుటచే మనకు వంశ పరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము అన్యాక్రాంతమవలేదు కదా! సత్యసంధుడయిన తండ్రిగారికి నిత్యము సేవలు చేయుచున్నావు కదా! ఇంతకి నీవు అరణ్యమునకు ఎందులకు వచ్చినావు.
కచ్చితంగా దేశాల్లో రాజా కుశలీ సత్యసంగరః
రాజసూయాశ్వమేధానామ్ ఆహర్తా ధర్మనిశ్చయః।। 9
భావం:- ధర్మనిరతుడై రాజసూయ- అశ్వమేథక్రతువులను ఆచరించిన సత్యప్రతిజ్ఞుడు అగు దశరథమహారాజు క్షేమమే కదా!
స కచ్చిద్బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహద్యుతిః ।ఇక్ష్వాకూణాముపాధ్యాయో యావత్ తాత! పూజ్యతే ।। 10
భావం:- నాయనా! బ్రాహ్మణోత్తముడును, బ్రహ్మతేజసంపన్నుడును, ఇక్ష్వాకు వంశమునకు గురువైన వశిష్ట మహర్షి ఎప్పటివలె గౌరవాదరములతో పూజలను అందుకొనుచున్నాడా!
సా తాత కచ్చిత్ కౌసల్యా సుమిత్రా ప్రజావతీ।
సుఖినీ కచ్చిదార్యా చ దేవీ నందతి కైకయీ।। 11
భావం:- దుఃఖితయై యున్న కౌసల్యా మాత నెమ్మదిగా ఉన్నదా! సత్సంతానవతియైన తల్లి సుమిత్రాదేేేవి కుశలమేగదా! పూజ్యురాలైన కైకేయిజనని ఆనందించుచున్నదా!
కచ్చిద్వినయసంపన్నః కులపుత్రో బహుశ్రుతః।అనసూయురనుద్రష్టా సత్కృతస్తే పురోహితః।। 12
భావం:- మన పురోహితుడు అహంకారం ఎరుగనివాడు, ఉత్తమవంశంలో జన్మించినవాడు, సమస్తవిద్యలను నేర్చినవాడు, ఇతరుల యందు దోషదృష్టి లేనివాడు, అందరికీ మార్గదర్శకుడు అట్టి మహానుభావుని నీవు ఆదరించుచున్నావు గదా!
కచ్చిదగ్నిషు తే యుక్తో విధిజ్ఞో మతిమాన్ ఋజుః।
హుతంచ హోష్యమాణం చ కాలే వేదయతే సదా।। 13
భావం:- హోమవిధులను బాగుగా ఎరిగినవారు, ప్రతిభాశాలురు, ఋజువర్తనులు అయిన బ్రాహ్మణులు హోమ కార్యములను నిర్వహింపజేయుటకు నీచే నియుక్తులైై, చేయబడిన హోమము గూర్చియు, చేయబడిన హోమములను గురించియు ఎప్పటికప్పుడు నీకు తెలియచేయుచున్నారు కదా!
కచ్చిద్దేవాన్ పితౄన్ మాతౄఃగురూన్ పితృ సమానపి।వృద్ధాంశ్చ తాత! వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్య సే।14
భావం:- నాయనా! యజ్ఞముల యందు ఆహుతులను సమర్పించుట ద్వారా, ఆరాధించుట ద్వారా దేవతలను, ఆజ్ఞలను పాటించుటచే, సేవలను చేయుటచే తల్లిదండ్రులను, బహుమతులను ఇవ్వడం ద్వారా సేవకులను, అభిమతములను అనుసరించి ప్రవర్తించుట ద్వారా గురువులను, ధనసహాయం ద్వారా జ్ఞాతులను, వినయవిధేయతలతో నమస్కరించుట ద్వారా జ్ఞాన, శీల, వయోవృద్ధులను, ధనదానాదులతో సంతోషపరుచుచు వైద్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆదరించుచున్నావు కదా!
ఇష్వస్త్రవరసంపన్నమ్ అర్ధశాస్త్రవిశారదమ్।
సుధన్వానముపాధ్యాయం కచ్చిత్ త్వం తాత! మన్య సే।। 15
భావం:- భరతా! శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో సమర్ధుడును, వివిధ నీతిశాస్త్రములలో పండితుడైన సుధన్వుడు అనే పేరు గల ఆచార్యుని గౌరవించుచున్నావుగదా!
కచ్చిదాత్మసమాః శూరాః శ్రుతవంతో జితేంద్రియాః।కులనాశ్చేంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత! మంత్రిణః।। 16
మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ!।సుసంవృత్తో మంత్రధరైః అమాత్యైః శాస్త్రకోవిథైః।। 17
కచ్చినిద్రావశం నైషీః కచ్చిత్ కాలే ప్రబుద్ధ్య సే।కచ్చిచ్ఛాపరరాత్రేషు చింతయస్యర్ధనైపుణ్యమ్।। 18
కచ్చిన్మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిస్సహ।
కచ్చిత్ తే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి।। 19
భావం:- నాయనా! విశ్వాసపాత్రులును, నీతో సమానులైన ధీరులును, రాజనీతిశాస్త్రమున ఆరితేరినవారును, రోమన్లకు లొంగని వారును, ఉత్తమవంశమున పుట్టినవారును, నీ మనసును ఎరిగి ప్రవర్తించువారును అయిన సత్పురుషులను మంత్రులనుగా నియమించితివిగదా! ఓ భరతా! సమస్త శాస్త్రములను నేర్చిన వారును, విషయములను గోప్యంగా ఉంచగలవారును ఆయన మంత్రులచే బాగుగా రక్షింపబడిన రహస్య ఆలోచనలే రాజుల యొక్క విజయమునకు మూలముల సుమా. నాయనా! నీవు నిద్రకు వశమగుటలేదుగదా! సకాలములో నిద్ర నుండి మేల్కొనుచున్నావు గదా! రాజ్యమునకు సంబంధించిన రహస్యాలోచనలను గూర్చియు నీవు ఒక్కడివి మాత్రమే ఆలోచించుట లేదు గదా! ఎక్కువమందితో మంత్రాంగము నెరపవు గదా! నీవు కావించిన రహస్య చర్చలు రాజ్యమును దాటి పోవటం లేదు కదా!
కచ్చిదర్ధం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం।
క్షిప్రమారభసే కర్తుం న ధీరయసి రాఘవ।। 20
భావం:- నాయనా! స్వల్పమైన సాధన సంపత్తితో అధికమైన లాభములను చేకూర్చు కార్యములను నిశ్చయించిన పిదప ఆలస్యం చేయకుండా వాటిని వెంటనే ప్రారంభించుచున్నావు కదా! (ఇంకా ఉంది).
No comments:
Post a Comment