Breaking

Sunday, October 18, 2020

ఓటమి ఏమి నేర్పుతుంది?

                      

                         ఈ భూమ్మీద గెలుపు సాధించిన వారి కన్నా ఓటమిని పొందిన వారు ఎక్కువ. గెలుపు పొందిన వాడు కూడా ముందు ఓటమి రుచి చూసి ఉంటాడు. అందుకే ఆఓటమిలో ఉండే బాధ అందరికి పరిచయమై ఉంటుంది. ఆ బాధని విజయానికి తొలిమెట్టుగా మనం భావించవచ్చు. ఆ బాధకి పట్టుదల జోడైతే గెలుపు సాధ్యమవుతుంది. ఇంత చిన్న విషయం మాకు తెలియదా దీనికి ఇంకొకరు చెప్పాలా అని అనుకోవద్దు.
                గెలిచినవాడు ఏమి చెప్పినా లోకం వింటుంది అంటారు. కానీ గెలిచిన వారికి  చెప్పే తీరిక, ఓపిక రెండూ ఉండవు. కానీ ఓడిన వాడికి చెప్పే ఓపిక ఉన్నా వినడానికి ఎవరూ ఉండరు ఓడిన ప్రతిసారి గెలవాలనే తాపత్రయం తప్ప. ఆ తాపత్రయమే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గెలుపుకి ఆనందానికి తేడా ఒక్క సెకను కానీ ఆనందానికి, బాధకి తేడా ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా. ఓటమి బాధతో ఆగిపోతే ఎప్పటికీ విజయాన్ని రుచి చూడలేము. గెలిచేవాడికి మాత్రం ఆ సెకను కాలంలో ఆవ గింజంతైనా అదృష్టాన్ని కలిగి ఉంటాడు ఏమో!

      ఆటలో ఓడిన వాడు మరొక ఆటలోనైనా గెలుస్తాడు. కానీ జీవితంలో ఓడిన వాడు గెలవటానికి ఒక్కోసారి  జీవితమంతా కూడా సరిపోదు. కాబట్టి కార్యం ప్రారంభించిన ప్రతి ఒక్కరు గెలవాలనే ప్రారంభిస్తారు. గెలిస్తే సంతోషం కానీ ఓడితే అందులో ఏదో ఒక గుణపాఠాన్ని  నేర్చుకుంటారు. 
 
                 అజయ్(55), కీర్తన(50) అను దంపతులకు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు మృదుల(24). మృదులను బాగా చదివించినప్పటికీ ఆమెకి ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక, అంతేకాక వ్యాపారం ఇష్టం కావడంతో తల్లిదండ్రులు కూడా వారికి ఉన్న ఇంటిని అమ్మి సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని తను ఆ కాంట్రాక్టులను పూర్తిచేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో సబ్ కాంట్రాక్ట్ లు బాగా వచ్చాయి.తరువాత కాంట్రాక్టులు తగ్గిపోవడం మొదలుపెట్టాయి. దానికి కారణం ఒక్కటే అదే మృదుల ఆవేశం. మృదులకి కోపం ఎక్కువ దానితో తన కింద ఉండే వారిని అరవడం, అలా ఆఫీస్ లో జాయిన్ అయిన వారు ఎక్కువ కాలం ఉండేవారు కాదు. కొత్తగా వచ్చే వారికి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాపారంలో నష్టం రావడంతో మృదుల ఇక వ్యాపారం తన చేయి దాటిందని తెలుసుకొని తండ్రి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేస్తుంది.

             తండ్రి కూతురు చెప్పిన విషయాలను విని ఉదయాన్నే ఇద్దరం బయటికి వెళదామని ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోమని చెప్పాడు. ఉదయాన్నే అజయ్ మృదులను తీసుకొని నడుచుకుంటూ వెళుతూ జీవితం అందరికీ బ్రతకటానికి, ఎదగటానికి దారి చూపిస్తుంది. కానీ మనలోని ఆవేశం, అహం మన ఎదుగుదలను కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు నీవు మాత్రమే గొప్పగా బ్రతకాలని, నీ కింద ఉండే వారిని చులకనగా చూస్తూ నీ ఓటమిని నీవే కొని తెచ్చుకున్నావ్. ఈ భూమి మీద ఉన్న అందరూ సమానమే. అందరికీ అందరితో అవసరాలు ఉంటాయి. నీవు ఆఫీసులో లేడిబాస్ లా కాకుండా అందరితో, అందరిలో ఒకరిలా ఎప్పుడైతే నవ్వుతూ పని చేయడం ప్రారంభిస్తావో ఆ క్షణం నీవు విజయానికి కి బాట వేస్తున్నావు అని అర్థం.

             తండ్రి చెప్పిన మాటలను అనుసరించి అప్పటివరకు నష్టాల్లో ఉన్నటువంటి ఆ కంపెనీని తిరిగి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి చిరునవ్వులు చిందిస్తూ తన కష్టాన్ని, నిద్ర లేని జీవితాన్ని పెదవి దాటి బయటకు రానివ్వకుండా నవ్వుతూ అందరిలో ఒకరిలా ఉండడంవల్ల అక్కడి జనాలు అందరూ మృదుల కంపెనీని తమ కంపెనీగా భావించి మూడు నాలుగు నెలల పాటు జీతం ఇవ్వకపోయినా మృదుల పడుతున్న కష్టాన్ని, ఆమె వారికి ఇస్తున్న గౌరవాన్ని చూసి వారు కూడా నిజాయితీగా పని చేస్తూ మృదులకు అండగా ఉండడం వలన మృదుల కేవలం సంవత్సరం కాలంలోనే లాభాలు గడించే కంపెనీ నిర్మించుకుంది అక్కడి నుండి ఆ సంస్థలో పని చేసే వారందరినీ తన కుటుంబంగా భావిస్తూ అందరితో సంతోషంగా పని చేయించుకుంటూ, వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ తన జీవితాన్ని కొనసాగించింది.
                ఈ కథలో కూతురుకి ధైర్యం చెప్పడానికి తండ్రి ఉన్నాడు కాబట్టి తను నష్టాన్ని, తన ఓటమిని తిరిగి సంవత్సర కాలంలోనే విజయంగా మార్చుకుంది.  చాలామంది ధనము, మిత్రులు, తల్లిదండ్రులు ఉన్నా ఓడిపోయామని బాధతోనో, సిగ్గుతోనో  చెడు వ్యసనాలకి అలవాటు పడటం, లేదా మధ్యలోనే జీవితాన్ని అంతం చేసుకోవడం చేస్తున్నారు. దీనివల్ల వారిని నమ్మిన కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక్క క్షణం నీ ఆలోచన నీ కుటుంబాన్ని గొప్పగా నిలబెడుతుంది.
                            మనం భూమిలో వేసిన విత్తనం కూడా మొలకెత్తి గాలికి, ఎండకి, వానకి కింద మీద పడి ఎదిగి మనకే కాయలను ఇస్తుంది ఎటువంటి సహాయం లేని ఒక చిన్న విత్తనమే ఎదిగితే ఇంత మంది సహాయం ఉండి మరి మనం ఇంకెంత విజయం సాధించవచ్చు. 
         ఓటమి ఇది ఎవరికీ తెలియనిది కాదు. ఓడినప్పుడు గెలుపు ఎలా ఉంటుంది. ఆ రుచి ఎలా ఆస్వాదించాలనే పట్టుదల పెరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పట్టుదలతో మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈ కథని ఓడిన ప్రతి ఒక్కరికి గెలవడానికి మార్గాలున్నాయని తెలియజేస్తూ ఈ కథను మీకు అంకితం చేస్తున్నాం.