తింటే గారెలే తినాలి. వింటే మహాభారతమే వినాలి అంటారు. ఎందుకో తెలుసా! తెలియకపోతే చివరి వరకు చదవండి తెలుస్తుంది. మనమందరం మహాభారతం చదివినా చదివక పోయినా అందరూ వినే ఉంటారు కాబట్టి అందరికీ తెలుసు అని అనుకుంటాము. అయినా మనకి తెలియని మహాభారతం చాలా ఉంది.
మనకి ధృతరాష్ట్రుడు, పాండురాజు అందరికీ తెలుసు. చాలామందికి తెలియని పేరే విదురుడు. సత్యవతి శంతనుడి కుమారుడు విచిత్రవీర్యుడు. అతనికి ఇద్దరు భార్యలు అంబిక, అంబాలిక. అందమైన భార్యలు ఉండడం వలన రాజ్యపాలన వదిలేసి రతిక్రీడలు జరపడం వలన శరీరం శుష్కించిపోయాడు. కేవలం ఏడేళ్ళలో ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత కురువంశ నాశనం జరగకూడదని సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమని అడుగగా వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశానని చెప్తాడు. సత్యవతి పెద్ద కుమారుడైన వేదవ్యాసుడిని ప్రార్థిస్తుంది.
సత్యవతి కోరిక మేరకు కురువంశ రక్షణకు వేదవ్యాసుడు దేవరన్యాయం ద్వారా సంతానాన్ని కలగచేస్తానని చెప్తాడు. మొదట వేదవ్యాసుని గదిలోకి అంబిక వెళ్లి ఆ చీకటిలో తెల్లని జుట్టు, తెల్లని గడ్డం, మాసిన తెల్లని వస్త్రాలతో ఉన్న వేదవ్యాసుడిని చూసి భయపడి కళ్లు మూసుకుంటుంది. అందువలన అంధుడిగా జన్మిస్తాడు. అతనే ధృతరాష్టుడు. అయితే మొదటివాడు గుడ్డి వాడు రాజ్య రక్షణకు పనికి రాడు కాబట్టి ఈసారి అంబాలికను పంపుతుంది. గదిలో ఉన్న వేదవ్యాసుని చూసి అంబాలిక శరీరం ఒక్కసారిగా కంపిస్తుంది. శరీరం కంపించడం వలన పాండు శరీరదారుడు జన్మించాడు. అందువల్ల అతనికి పాండురాజు అని పేరు వచ్చింది. రెండవ కుమారుడు కూడా లోపం వలన జన్మించాడని, మూడవసారి సత్యవతి మళ్ళీ అంబాలికను వేదవ్యాసుని వద్దకు వెళ్ళమని చెప్పగా సరేనని చెప్పి దాసిని పంపుతుంది. దాసి వేదవ్యాసునికి సేవ చేసి అతని అనుగ్రహంతో యమధర్మరాజే శాపం వలన విదురుడిగా జన్మించాడు. అని మహాభారతంలో చెప్పబడింది. ఆ శాపం ఏమిటి? ఎందుకు విదురునిగా జన్మించాడు.
పూర్వం మాండవ్యుడు అనే మహర్షి ఆశ్రమంలో మౌనవ్రతం చేస్తున్న సమయంలో ఇద్దరు దొంగలు రాజమందిరంలోని ధనాన్ని దొంగిలించి పారిపోతుండగా రక్షక భటులు వెంబడిస్తారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మాండవ్యుని ఆశ్రమంలోకి వెళ్ళి భూమిలో ధనాన్ని దాచి, ఆశ్రమంలో దాక్కుంటారు. అక్కడి వరకు వెంబడిస్తూ వచ్చిన రక్షకభటులు దొంగలు కనపడకపోయేసరికి ధ్యానంలో ఉన్న మహర్షిని అడుగుతారు. కానీ అతను మాట్లాడకపోయేసరికి ఆశ్రమం మొత్తం వెతకగా దొంగలు, వారు దోచిన ధనముతో దొరికిపోయారు. అక్కడే ఉన్న మునే వీళ్ళకి సంధాన కర్త. అంతా తెలిసి దొంగ వేషాలు వేస్తున్నాడు. మనం గొంతు చించుకొని అరిచినా పలకడు. మునికి దొంగలతో సంబంధం ఉందని భావించి తీసుకుని వెళ్లి మహారాజు ముంగిట నిలబెడతారు.
మహారాజు దొంగలకి మరణశిక్ష వారికి సహకరించినందుకు మాండవ్యున్ని ఉద్దేశించి ముని వేషంలో ఉన్న దొంగ వీడు. కాబట్టి వీడికి ఊరి బయట కొరత వేయండి అని ఆజ్ఞాపిస్తాడు. కొరత మీద ఉన్నా కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మాండవ్యముని. తిండి తిప్పలు లేకుండా బ్రతికాడు. అతన్ని చూసి ఎంతో మంది మహర్షులు ఆశ్చర్యపోయారు. రాత్రి పక్షుల రూపంలో వచ్చి ఎంత గొప్ప తపశ్శాలివి నీకు ఈ పరిస్థితిని కలిగించిన వారెవరు? అని ప్రశ్నించారు. దానికి మాండవ్యుడు తను చేసుకున్న కర్మే సుఖానైనా, దుఃఖానైనా తెచ్చిపెడుతుంది. దీనికి వేరే వాళ్ళని అనడం దేనికి అని సమాధానమిస్తాడు.
ఆ మాటలు విన్న నగర రక్షకులు వెళ్లి మహారాజుకు తెలియజేస్తారు. రాజు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తను తెలియక చేసిన పొరపాటు అని క్షమాపణ అడుగుతాడు. కొరత నుండి దింపించబోయాడు. కానీ శూలం ఊడి రాకపోవడంతో చేసేదిలేక మొదలు నరికి వేశారు. అప్పటినుండి మాండవ్యున్ని మణిమాండవ్యుడు అంటారు.
గొప్పదైన తపః ప్రభావము చేత లోకాలను తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకసారి యమలోకానికి వెళ్లి యమున్ని "ఏం పాపం చేశానని నాకు కొరత మీద అంతటి ఘోరమైన శిక్ష వేశావు. అని ప్రశ్నించగా దానికి యముడు నీవు చిన్నప్పుడు తూనీగలను పట్టి ముళ్ళు గుచ్చావు దాన్ని ఫలమే నీవు అనుభవించావు. అయినా "చేసిన పాపం అనుభవించక తప్పదు" అని యముడు చెప్తాడు.
ఆ మాత్రం దానికి ఇంతటి కఠిన శిక్షా? అంటూ ఉగ్రుడయ్యాడు మాండవ్యుడు. బాల్యంలో అజ్ఞానంలో చేసినదానికి తగని శిక్ష వేశావు. అందుకని యమున్ని మానవ లోకంలో శూద్రయోనిలో పుడతావు అంటూ శాపం పెడతాడు. అప్పటినుండి ఈ పద్నాలుగేళ్లు దాటని పసివాళ్ళు ఏమి చేసినా పాపం తగలకూడదు, వాళ్లకి ఎవరు ఏం నష్టం కలిగించిన పాపం చుట్టుకుంటుంది ఇది నా శాసనం అని తెలియజేస్తాడు. ఆనాటి మాండవ్యుని శాపం వలన వేదవ్యాసుని దేవరన్యాయంతో దాసికి యముడే విదురునిగా జన్మిస్తాడు.
అయితే విదురుడు మాత్రం రాజనీతిలో మహా నిపుణుడు. ధృతరాష్ట్రునికి మంత్రి కూడా. అన్నిటికన్నా నీతి, న్యాయం వైపు నిలబడే వ్యక్తిగా మహాభారతంలో చెప్పబడింది. దుర్యోధనుడు పుట్టినప్పుడే జాతకాన్ని చూసి జాతకం ప్రకారం దుర్యోధనుని చేతిలో రాజ్యం పెడితే ఎప్పటికైనా నాశనం అవుతుందని ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. కానీ ధృతరాష్టుడు పుత్ర వాత్సల్యంతో వినకుండా రాజ్యపరిపాలన దుర్యోధనునికి అందిస్తాడు. పాండవులు కాశీకి వెళ్లేటప్పుడు లక్క ఇంట్లో ఉన్న సమయంలో కౌరవులు లక్క ఇంటిని తగల పెట్టిన సమయంలో విదురుని మాటను అనుసరించి పాండవులు సొరంగ మార్గం గుండా బయటపడి వారి ప్రాణాలను కాపాడుకుంటారు. పాండవులు, కౌరవులతో మాయాజూదం ఆడేటప్పుడు కూడా వద్దని విదురుడు చెప్పినా ధృతరాష్ట్రుడు వినడు. విదురుడు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో కూడా అధర్మాన్ని ఆచరించడం ఇష్టం లేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాడు.
నీతిని బోధించే గొప్ప గ్రంథాలలో విధురనీతి కూడా ఒకటి.
5 comments:
Fablous
Fantastic story
Sir
ఇలా ఒక్కోక్కరి గురించి వివరిస్తే రాబోయే తరాలకు అందించటానికి ఉపయోగపడుతుంది.
Keep it up
Rajula gurinchi pettandi
Super
Post a Comment